సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్

  • సెల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందన్న సత్యవతి
  • ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సీతక్కకు సవాల్
  • డైవర్షన్ రాజకీయాల కోసమే కేసీఆర్‌కు నోటీసులు అంటూ ఫైర్

మంత్రి సీతక్కపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న సత్యవతి... సీతక్క తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మార్కెట్లో రూ. 6,000 ధర ఉన్న ఫోన్లను రూ. 14,000 పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కాదా? అని ప్రశ్నించారు. ఈ కొనుగోళ్లపై ధైర్యం ఉంటే తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటని విమర్శించారు. కేవలం డైవర్షన్ రాజకీయాల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు, మీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం సాధ్యం కాదని... ఆంధ్రప్రదేశ్‌లో 5జీ ఫోన్లకు సంబంధించిన ఫొటోలను తెలంగాణలో పంపిణీ చేసినట్లుగా చూపిస్తూ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 

ఒక మహిళా మంత్రిగా ఉండి సీతక్క మాట్లాడే తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పడం తెలుసని, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

Satyavathi Rathod
Seethakka
BRS
Telangana Politics
KCR
Cell Phone Scam
Corruption Allegations
Telangana Government

More Telugu News