డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ ‘ఫైనల్ వార్నింగ్’: వీధుల్లోకి వచ్చి పోరాడతామని హెచ్చరిక

MK Stalin Issues Final Warning to Center on Delimitation
  • డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమన్న స్టాలిన్
  • పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శ
  • దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని వ్యాఖ్య

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.


డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తమిళనాడు చూస్తూ ఊరుకోదని, ఇది బెదిరింపు కాదని, కేంద్రానికి తన 'ఫైనల్ వార్నింగ్' అని స్టాలిన్ హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాడుతుందని, ఈ పోరాటంలో ప్రజలే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని, దీనిని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే చెన్నైలో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.


పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ప్రధాని మోదీ పార్లమెంటులో హామీ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినా, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ఈ విషయంపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

Go Back to Shorts
MK Stalin
Tamil Nadu
Delimitation
Constituency delimitation
South India
Narendra Modi
BJP
Political News
Indian Politics

More Telugu News