ఇరాన్ ఓడరేవుల వద్ద నౌకలను అడ్డుకుంటున్న అమెరికా... సమీపానికి వస్తే ఇరాన్ నౌకలను పేల్చేస్తామన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా నావికా దళం పూర్తిస్థాయి దిగ్బంధాన్ని ప్రారంభించడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా నేవీ మరిన్ని బలగాలను రంగంలోకి దించింది. ఇరాన్ ఓడరేవుల వద్ద వచ్చిపోయే నౌకలను అడ్డుకుంటోంది. తమ దిగ్బంధం సమీపంలోకి ఇరాన్ నౌకలు వస్తే వాటిని తక్షణమే ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఓడరేవులకు వద్దకు నౌకలు రావాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు. 

ఇరాన్ ఓడరేవులకు వచ్చే, పోయే అన్ని సముద్ర మార్గాలను మూసివేస్తూ అమెరికా సైన్యం నిర్దేశించిన గడువు ప్రకారం ఈ దిగ్బంధం ప్రారంభమైంది. "మా దిగ్బంధం సమీపంలోకి ఏ ఒక్క ఇరాన్ నౌక వచ్చినా, దానిని వెంటనే తుడిచిపెట్టేస్తాం" అని ట్రంప్ హెచ్చరించారు.

అయితే, అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల కదలికలపై ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమని ఇరాన్ సాయుధ దళాలు పేర్కొన్నాయి.

మరోవైపు, పాకిస్థాన్‌లో అమెరికాతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అమెరికా వైఖరి వల్లే చర్చలు ముందుకు సాగలేదని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై బాంబు దాడులు ప్రారంభించింది. మరూబ్ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం నలుగురు మరణించారు. హెజ్బొల్లాతో ఘర్షణలు కొనసాగుతుండటంతో బింట్ జెబిల్ పట్టణ ప్రవేశ మార్గాలను ఇజ్రాయెల్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Donald Trump
Iran
United States Navy
Iran ports
Persian Gulf
US Iran relations
Iran sanctions
Israel
Lebanon
Hezbollah

More Telugu News