రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్

Revanth Reddys Proposal Unconstitutional Says Bandi Sanjay

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి వాదనను రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేశారు. 


"అత్యధిక ఆదాయం ఇచ్చే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి వాదన. అదే నిజమైతే హైదరాబాద్‌కే అన్ని సీట్లూ ఇవ్వాలా? వెనుకబడిన పాలమూరు, ఆదిలాబాద్ వంటి జిల్లాల పరిస్థితి ఏమిటి?" అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు నిధులు పంపి, ఇప్పుడు డబ్బు చుట్టూనే సిద్ధాంతాలు అల్లుతున్నారా? అని ఎద్దేవా చేశారు.


బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పునాదులను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని విమర్శించారు. అంబేద్కర్ జయంతికి ముందే ఆయన ఆశయాలను కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడటం బాధాకరమని, అంబేద్కర్ బతికుంటే కాంగ్రెస్‌ను దేశం నుంచి బహిష్కరించేవారని మండిపడ్డారు.


కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని విమర్శించారు. గత 50 ఏళ్లలో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన, గతంలో పార్లమెంట్‌లో బిల్లు కాపీలు చించివేసిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడంపై నిలదీశారు. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచాలని ప్రధాని మోదీ నిర్ణయించారని, ఇది అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విభజన రాజకీయాలకు నిదర్శనమని, ఇప్పటికైనా రాజ్యాంగ విలువలపై గౌరవంతో మాట్లాడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Bandi Sanjay
Revanth Reddy
Telangana
Constituency delimitation
Income based seats
Bandi Sanjay slams Revanth Reddy
Revanth Reddy comments
Indian Constitution
Political news
Telangana politics

More Telugu News