టీజీ టెట్-2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు ఇవిగో!

తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకుంటున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్-జూన్-2026) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సోమవారం జారీ చేసింది. ఈ పరీక్షలను జూన్ 15 నుంచి జూన్ 30వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం, ఉపాధ్యాయ నియామకాలకు టెట్ అర్హత తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీజీటెట్‌ను నిర్వహిస్తోంది. డీఈడీ/డీఎల్ఎడ్, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి కూడా మళ్లీ పరీక్ష రాయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-I రాయాల్సి ఉంటుంది. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు పేపర్-IIలో అర్హత సాధించాలి. రెండు కేటగిరీలకూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకూ హాజరు కావచ్చు. పరీక్ష ఫీజును జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు రూ. 1000గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు రూ. 950గా ఫీజు ఖరారు చేశారు.

టీజీ టెట్-2026 ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 13
వివరణాత్మక నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 15 నుంచి
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు 
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు 
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9 నుంచి 
పరీక్షల తేదీలు: జూన్ 15 నుంచి జూన్ 30 వరకు 
పరీక్షల వేళలు: ఉదయం 9:00 - 11:30, మధ్యాహ్నం 2:00 - 4:30 
ఫలితాల వెల్లడి: జూలై 28 నుంచి జూలై 31 మధ్య

అభ్యర్థులు తమ దరఖాస్తులను schooledu.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాలను (జిల్లాలు) ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు. మరిన్ని వివరాలు, సహాయం కోసం 7093708883, 7093708884, 7093958881, 7093468882 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.






TG TET 2026
Telangana TET
TGTET
Teacher Recruitment
School Education Department
Naveen Nicolas
Telangana Teachers Eligibility Test
TET Exam Date
TET Application
Telangana Government Jobs

More Telugu News