హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు
- హర్మూజ్‌ను దిగ్బంధిస్తామనే అమెరికా హెచ్చరికతో ఉద్రిక్తత
- నిలిచిపోయిన ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లు
- వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు నౌకాదళం ప్రయత్నం
హర్మూజ్‌లో నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు భారత నౌకాదళం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నౌకాదళానికి చెందిన ఆరు ఓడలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించాయి. మన నౌకలను సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటించేందుకు ఇవి సాయపడనున్నాయి. ఈ జలసంధి మార్గంలో మొత్తం 25 భారత నౌకలు ఉన్నాయి. అయితే అప్పటికే పది నౌకలు ఈ జలసంధిని దాటాయి.
ఇరాన్ ఓడరేవులను సోమవారం నుంచి దిగ్బంధిస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించడం తెలిసిందే. హర్మూజ్ మీదుగా నౌకల రవాణాను నిలిపివేయనప్పటికీ అగ్రరాజ్యం ప్రకటనతో ఈ జలసంధిలో నౌకల రవాణా నెమ్మదించింది. నౌకల రాకపోకల అకస్మాత్తుగా తగ్గినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.