Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిరిండియా ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు

Air India Tata offers employee stock options based on performance
Advertisement
  • ఎయిరిండియాలో పనితీరు ఆధారిత స్టాక్ ఆప్షన్ల పథకం 
  • ఉత్పాదకత పెంచి సంస్థను లాభాల్లోకి తేవడమే టాటా గ్రూప్ లక్ష్యం
  • పైలట్లు, ఇంజనీర్లు సహా అర్హులైన ఉద్యోగులకు 22.71 కోట్ల షేర్లు
  • 1 నుంచి 5 ఏళ్ల వెస్టింగ్ పీరియడ్.. లక్ష్యాల సాధనపైనే షేర్ల కేటాయింపు
  • ఇప్పటికే ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లలో ఇలాంటి పథకాలు
Advertisement
నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ ఎయిరిండియాను లాభాల బాట పట్టించేందుకు టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పురోభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ, వారిలో ఉత్సాహం నింపేందుకు 'పెర్ఫార్మెన్స్-లింక్డ్ స్టాక్ ఆప్షన్స్ (పీఎస్ఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ద్వారా ఉద్యోగుల ఉత్పాదకతను పెంచి, సంస్థ వృద్ధికి బాటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సోమవారం లైవ్‌మింట్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఈ కొత్త పథకానికి 'పీఎస్ఓపీ 2026' అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 13న జరిగిన సర్వసభ్య సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. ఈ ప్లాన్ కింద పైలట్లు, ఇంజనీర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్ సహా అర్హులైన ఉద్యోగులకు కంపెనీ స్టాక్ ఆప్షన్లు కేటాయిస్తారు. ఉద్యోగులు ఈ షేర్లను రూ.4 ముఖ విలువ నుంచి, కేటాయింపు సమయంలోని మార్కెట్ విలువ మధ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

"ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో ప్రస్తుతం, భవిష్యత్తులో పనిచేసే అర్హులైన ఉద్యోగుల పనితీరుకు ప్రతిఫలం ఇవ్వడం, సంస్థ వృద్ధికి, లాభదాయకతకు దోహదపడేలా వారిని ప్రేరేపించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతిభావంతులను ఆకర్షించడం, నిలుపుకోవడం కూడా దీని లక్ష్యం" అని సమావేశ తీర్మానంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 6న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం ఈ పథకం కింద కంపెనీ మొత్తం షేర్ క్యాపిటల్‌లో 0.25 శాతానికి సమానమైన సుమారు 22.71 కోట్ల స్టాక్ ఆప్షన్లను కొత్త షేర్లుగా జారీ చేయనున్నారు.

ఈ పథకంలో షేర్ల కేటాయింపునకు 1 నుంచి 5 సంవత్సరాల వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఉద్యోగులు దీర్ఘకాలం సంస్థతో కొనసాగేలా టాటా ప్రోత్సహిస్తోంది. అయితే, పనితీరు ఆధారంగానే షేర్ల కేటాయింపు ఉంటుంది. సంస్థ నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యాలలో 85 శాతం కంటే తక్కువ సాధిస్తే, ఉద్యోగులు కేవలం సగం షేర్లను మాత్రమే పొందే అవకాశం ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ఎవరికి, ఎన్ని షేర్లు, ఏ ధరకు కేటాయించాలనేది నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ నిర్ణయిస్తుంది.

ఇప్పటికే దేశంలోని లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో, స్పైస్‌జెట్, అలాగే ప్రైవేటు సంస్థ ఆకాశ ఎయిర్‌లలో ఇలాంటి ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకాలు అమల్లో ఉన్నాయి. 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసినప్పుడు కూడా దాదాపు 8,000 మంది ఉద్యోగులకు షేర్లను కేటాయించారు. 

ఇదిలా ఉంటే... ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ మార్చి 30న తన పదవికి రాజీనామా చేసినా, కొత్త వ్యక్తి బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగనున్నారు. ఈ నాయకత్వ మార్పు సమయంలోనే కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Advertisement
Advertisement
Air India
Tata Group
Air India PSOP 2026
employee stock options
Campbell Wilson
airline industry
aviation sector
stock allocation
employee benefits
performance linked incentives

More Telugu News