గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్!

Asha Bhosle Last Social Media Post About Life Essence Goes Viral
భారత సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే నిన్న‌ కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆమె, అభిమానులను తీరని శోకసంద్రంలో ముంచివెళ్లారు. అయితే, మరణానికి కొన్ని వారాల ముందే ఆమె పాడిన చివరి పాట, దాని గురించి ఆమె పంచుకున్న భావాలు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి.

ఆశా భోంస్లే పాడిన చివరి పాట 'ది షాడోవీ లైట్'. ప్రముఖ బ్రిటిష్ వర్చువల్ బ్యాండ్ 'గొరిల్లాజ్' రూపొందించిన 'ది మౌంటెన్' (పర్వత్) అనే ఆల్బమ్‌లో ఈ పాట ఉంది. ఈ ఆల్బమ్ 2026 ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ పాట ప్రమోషన్‌లో భాగంగా ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టే ఆమె చివరి పోస్ట్‌గా నిలిచిపోయింది. అందులో ఆమె తన జీవితం, సంగీతం, మరణానంతర స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు తాత్విక చింతనను రేకెత్తిస్తున్నాయి.

చివరి పోస్ట్‌లో ఆశా ఏమన్నారంటే?
"ది షాడోవీ లైట్ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. వారణాసిని సందర్శించి, పవిత్ర గంగా నదిలో ప్రయాణించినప్పుడు నాకు జీవిత సారాంశం ఏమిటో అర్థమైంది. నేను ఎవరిని, ఈ భూమిపై ఏం చేయాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది" అని ఆశా భోంస్లే తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

"ఈ పాటలో నేను నదిని దాటడం అనేది నా జీవిత ప్రయాణానికి ప్రతీక. నా పుట్టుక, బంధాలు, సంగీతం పట్ల నా అంకితభావం, విజయాలు, ఒక కూతురిగా, తల్లిగా, సోదరిగా, భార్యగా నా బాధ్యతలు.. వీటన్నిటినీ ఈ ప్రయాణం సూచిస్తుంది. నా పడవ నడిపేవాడే నా సంగీతం, నా మార్గదర్శి. నేను అవతలి ఒడ్డుకు చేరినప్పుడు నా ప్రయాణం పూర్తవుతుంది, నేను మోక్షాన్ని పొందుతాను" అని ఆమె వివరించారు.

"అప్పుడు మన చుట్టూ తేలియాడే వేలాది శబ్దాలలో నేను ఒకదాన్ని అవుతాను. వాటిలో కొన్నింటిని కలిపితే ఒక అందమైన బాణీ ఏర్పడుతుంది. అలా నేను కూడా ఒక సంగీత స్వరంగా మారి, రాబోయే తరతరాలు వినే ఒక అద్భుతమైన పాటలో భాగమవుతాను. ప్రకృతిలో కలిసిపోయే ఆ స్వేచ్ఛ కోసమే నేను ఎదురుచూస్తున్నాను" అంటూ తన పోస్ట్‌ను ముగించారు.

గొరిల్లాజ్ బ్యాండ్..
సంగీతకారుడు డేమన్ అల్బార్న్ నేతృత్వంలోని గొరిల్లాజ్ బ్యాండ్, భారతదేశ స్ఫూర్తితో 'ది మౌంటెన్' ఆల్బమ్‌ను ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, వారణాసి వంటి ప్రాంతాల్లో రికార్డ్ చేసింది. ఆశా భోంస్లేతో పాటు ఈ ఆల్బమ్‌లో సితార్ విద్వాంసురాలు అనౌష్క శంకర్, గాయని ఆశా పుత్లీ, సరోద్ విద్వాంసులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, ఫ్లూటిస్ట్ అజయ్ ప్రసన్న వంటి ప్రముఖ భారతీయ కళాకారులు కూడా పాలుపంచుకున్నారు. తన చివరి పాటలో జీవిత సారాన్ని, మోక్ష మార్గాన్ని వివరిస్తూ ఆశా భోంస్లే లోకాన్ని వీడటం ఆమె అభిమానులను మరింత భావోద్వేగానికి గురిచేస్తోంది.
Go Back to Shorts
Asha Bhosle
Asha Bhosle last song
The Shadowy Light
Gorillaz band
The Mountain album
Anoushka Shankar
Indian music
death
Varanasi
Ganga river

More Telugu News