కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తాం.. వచ్చే ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టబోయే పాదయాత్రను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేపట్టవచ్చని చెప్పారు. రాజకీయాల్లో ప్రతి కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని, అయితే ప్రజల మద్దతు మాత్రం కాంగ్రెస్‌కే ఉందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన పోటీదారులే లేరని, బీఆర్‌ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు.
బీఆర్‌ఎస్ పేరు మార్చినా లేదా బీజేపీతో కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ జైత్రయాత్రను అడ్డుకోలేరని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ముఖ్యంగా సింగరేణిలో జరిగిన అక్రమ ఒప్పందాలు, అవినీతిని కార్మికులు ఎన్నటికీ మర్చిపోరని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో పునరుజ్జీవం పొందే శక్తి లేదని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవితకు ఫండింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెబుతూ, ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, ప్రతి నెలా ప్రభుత్వం సుమారు రూ. 7 వేల కోట్ల అప్పులను చెల్లిస్తోందని మహేశ్ గౌడ్ వెల్లడించారు. ఈ క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. అప్పుల భారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.