వికారాబాద్ లో స్కూటీని ఢీకొట్టిన లారీ.. కుమార్తె సహా దంపతుల దుర్మరణం

జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పెద్దేముల్ మండల పరిధిలో వేగంగా దూసుకొచ్చిన లారీ.. ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్‌ కు చెందిన కవిరాజ్ (40), పావని (35) దంపతులు తమ కుమార్తె కీర్తన (11), కుమారుడు కార్తీక్ (13)తో కలిసి ఆదివారం రుక్మాపూర్‌ కు వెళ్లారు. మే 1న పావని సోదరుడి వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రుక్మాపూర్ కు వెళ్లిన కవిరాజ్ కుటుంబం.. సాయంత్రం స్కూటీపై జహీరాబాద్‌ కు తిరిగి బయలుదేరింది. ఈ క్రమంలో తట్టెపల్లి గ్రామ శివారులోకి రాగానే, ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది.

దీంతో తీవ్రంగా గాయపడ్డ కవిరాజ్, పావని, కీర్తన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్తీక్ ఒక్కడే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్‌పై కేసు నమోదు చేసి, లారీని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

Vikarabad accident
Road accident Vikarabad
Peddemul mandal
Scooty accident
Family death
Telangana road accident
Tandur hospital
Truck accident
Zahirabad

More Telugu News