తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు, రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేయడంలో భాగంగా పేద రోగులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా "హెల్త్ ఏటీఎం"లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏటీఎంల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే దాదాపు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.

ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించారు. అక్కడ ఈ యంత్రాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడంతో అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. హెల్త్ ఏటీఎంల ద్వారా వచ్చిన పరీక్ష ఫలితాలను, టీ-డయాగ్నోస్టిక్స్, ప్రముఖ ప్రైవేట్ ల్యాబ్‌ల రిపోర్టులతో పోల్చి చూడగా, ఫలితాల్లో కచ్చితత్వం ఉండటంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద, సామాన్య ప్రజలకు వేల రూపాయలు ఖర్చయ్యే కీలక వైద్య పరీక్షలు ఇకపై సులభంగా, వేగంగా అందనున్నాయి.

క్లౌడ్ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా బీపీ, ఈసీజీ, శరీరంలోని కొవ్వు శాతం, ఆక్సిజన్ స్థాయులు, ఉష్ణోగ్రత వంటి 65 రకాల ప్రాథమిక పరీక్షలను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. వీటితో పాటు రక్త నమూనాల ద్వారా గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం, కిడ్నీ పనితీరు, థైరాయిడ్ వంటి కీలక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అంతేగాక‌ గర్భిణుల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ వ్యాధుల నిర్ధారణకు డెర్మాస్కోప్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా, రోగికి సౌకర్యవంతంగా మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)తో అనుసంధానించారు. దీనివల్ల రోగి చేయించుకున్న ప్రతి పరీక్ష రిపోర్ట్ డిజిటల్ రూపంలో వారి అభా కార్డులో భద్రంగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన వెంటనే రిపోర్టులు నేరుగా రోగి మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా చేరతాయి. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని గ్రామీణ ప్రజలకు సహాయపడేందుకు ప్రతి ఏటీఎం వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు.

అయితే, ఒక రోగికి అన్ని పరీక్షలు పూర్తి చేయడానికి దాదాపు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుండటం పైలట్ ప్రాజెక్టులో ఒక సవాలుగా నిలిచింది. ఈ సమస్యను అధిగమించడానికి, రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆసుపత్రుల్లో రెండు లేదా మూడు హెల్త్ ఏటీఎం యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. త్వరలోనే ఈ సదుపాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Telangana Health ATMs
Telangana government hospitals
Health ATMs
medical tests
T-diagnostics
Ayushman Bharat Health Account
ABHA card
free medical tests
King Koti Hospital
Malakpet Hospital

More Telugu News