పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!

Hyderabad Man Arrested for Dowry Fraud Via Matrimony Site
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై, తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పెళ్లి పేరుతో రూ.1.5 కోట్ల కట్నం డిమాండ్ చేసి, నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బండారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపులతో బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

హైదరాబాద్‌కు చెందిన పనస మధు (30) ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు.

మాటలతో నమ్మించి, ఆమె కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన ఉద్యోగాన్ని నిరూపించేందుకు నకిలీ ఐడీ కార్డు కూడా చూపించడంతో వారు నిజమని నమ్మారు. యువతి కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులని గ్రహించిన మధు, తొలుత రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు. చివరకు ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం రూ. కోటిన్నరకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.

అయితే, ఇటీవల ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ గదికి పిలిపించిన మధు, ఆమెను అనుమానిస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి, ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో అనుమానం వచ్చిన వారు మధు ఉద్యోగం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను FCI ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మధును ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Go Back to Shorts
Panasa Madhu
Matrimony fraud
Hyderabad crime
Dowry harassment
Pre wedding shoot
Fake government job
FCI
Food Corporation of India
Nalgonda
Cyberabad police

More Telugu News