లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడింది మరెవరో కాదు, మృతుడి తోడల్లుడు, నరసరావుపేటలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట కోటయ్య అని తేల్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించి, అతడిని, మరో నిందితుడిని అరెస్టు చేశారు. రక్షించాల్సిన పోలీసు సిబ్బందే ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా తేలడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ (37) ఒంగోలులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత శుక్రవారం (ఏప్రిల్ 10) తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి సమీపంలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన స్కూటీ మృతదేహంపై పడి ఉండటంతో, తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా అందరూ భావించారు. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. మృతుడి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉండటంతో ఇది ప్రమాదం కాదని, హత్యేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. లోతుగా దర్యాప్తు చేపట్టగా, హత్యకు ముందు నిందితులు మద్యం కొనుగోలు చేసినప్పుడు జరిపిన ఒక ఫోన్‌పే లావాదేవీ కీలక ఆధారంగా మారింది. ఈ ట్రాన్సాక్షన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.

మృతుడు హరిప్రసాద్ భార్య, నిందితుడు కానిస్టేబుల్ వెంకట కోటయ్య భార్య అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. హరిప్రసాద్ తరచూ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని నాగజ్యోతి తన సోదరి భర్త వెంకట కోటయ్యతో చెప్పుకుని బాధపడేది. తన మరదలి కష్టాలు చూడలేక, హరిప్రసాద్‌ను అడ్డు తొలగించాలని కానిస్టేబుల్ కోటయ్య నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం తన స్నేహితుడైన శ్రీనివాసరావుతో కలిసి పక్కా ప్రణాళిక రచించాడు. గురువారం రాత్రి 'పార్టీ చేసుకుందాం రా' అని నమ్మించి హరిప్రసాద్‌ను నరసరావుపేటకు పిలిపించారు. కోటప్పకొండ రోడ్డులోని ఓ హోటల్‌లో ముగ్గురూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. హరిప్రసాద్‌కు పూర్తిగా మత్తు ఎక్కాక, యడవల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బండరాయితో తలపై బలంగా మోది దారుణంగా హత్య చేశారు. అనంతరం దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై స్కూటీని పడేశారు. అయితే పోలీసుల దర్యాప్తుతో అసలు నిజం బయటపడింది. పోలీసులు కానిస్టేబుల్ వెంకట కోటయ్య, అతని స్నేహితుడు శ్రీనివాసరావును అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Hariprasad
Lawyer Hariprasad murder
Venkata Kotaiah
Palnadu police
Andhra Pradesh crime
Narasaraopet
police constable
family disputes
murder investigation
Chilakaluripet

More Telugu News