ఆశా భోంస్లే మ‌ర‌ణానికి కార‌ణం అదే: వైద్యులు

భారత సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. తన గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని, గానకోకిల ఆశా భోంస్లే (92) ముంబైలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో నిన్న‌ ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఇవాళ‌ కన్నుమూశారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది.

ఆశా భోంస్లే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, బహుళ అవయవాలు విఫలం కావడం వల్లే ఆమె మరణించారని డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. "ఆశా భోంస్లే మరణించడం చాలా బాధాకరమైన వార్త. ఆమె బహుళ అవయవాల వైఫల్యం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) కారణంగా కన్నుమూశారు" అని ఆయన తెలిపారు. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ఆసుపత్రి బయట ఆశా భోంస్లే మరణవార్తను అధికారికంగా ప్రకటించారు.

ఆమె అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కడసారి నివాళులర్పించాలనుకునే వారు సోమవారం ఉదయం 11 గంటలకు లోయర్ పరేల్‌లోని ఆమె నివాసానికి రావచ్చని కుమారుడు ఆనంద్ భోంస్లే కోరారు. "మా అమ్మ ఆశా భోంస్లే ఈరోజు మరణించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రజలు ఆమె నివాసంలో నివాళులర్పించవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న తన నానమ్మను ఆసుపత్రిలో చేర్పించినట్లు శనివారం ఆమె మనవరాలు జనై భోంస్లే ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

1943లో 'మాఝా బల్' అనే మరాఠీ చిత్రంతో తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆశా భోంస్లే, ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 'చురా లియా హై తుమ్నే జో దిల్ కో', 'దో లఫ్జోం కీ హై దిల్ కీ కహానీ', 'ఓ హసీనా జుల్ఫోంవాలే', 'యే లడ్కా హాయ్ అల్లా' వంటి ఎన్నో అజరామరమైన గీతాలతో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె మృతి పట్ల యావత్ సినీ, సంగీత ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Asha Bhosle
Asha Bhosle death
Prateeth Sandani
Mumbai
Indian singer
Bollywood singer
multi organ failure
Marathi cinema
Hindi cinema
funeral

More Telugu News