డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సుదీర్ఘకాలంగా టీమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోమీ భిందర్, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి చిక్కుల్లో పడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం గువాహ‌టిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చున్న రోమీ భిందర్, తన మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్న దృశ్యాలు టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. 

ఒక బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "భిందర్ కచ్చితంగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించారు. మ్యాచ్ సమయంలో డగౌట్‌లో సెల్‌ఫోన్లు నిషేధం" అని ఆయన తెలిపారు.

ఐపీఎల్ 2026 నిబంధనల ప్రకారం, టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఫోన్ ఉపయోగించవచ్చు కానీ, డగౌట్‌లో మాత్రం వాడటానికి అనుమతి లేదు. ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పటి నుంచి జట్టుతో అనుబంధం ఉన్న భిందర్‌కు ఈ యాంటీ-కరప్షన్ నిబంధనల గురించి పూర్తిగా తెలిసి ఉంటుందని, అయినా ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ విషయంపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) విచారణ చేపట్టనుంది. విచారణ పూర్తయ్యాక ఏసీయూ హెడ్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా భిందర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఐపీఎల్ పాలక మండలి నిర్ణయిస్తుంది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమైనా, నిబంధనల ఉల్లంఘన కావడంతో చర్యలు తప్పవని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అతనికి భారీ జరిమానా విధించడం లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకుండా నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ సైతం స్పందిస్తూ యాంటీ కరప్షన్ అధికారుల పనితీరును ప్రశ్నించడం గమనార్హం.

Romi Bhinder
Rajasthan Royals
IPL 2026
BCCI
Dugout
Mobile Phone
Vaibhav Suryavanshi
Anti Corruption Unit
Lalit Modi
Royal Challengers Bangalore

More Telugu News