సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకుగాను అతడికి రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. 

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో సీఎస్కే జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ గైక్వాడ్‌కు రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన మూడో కెప్టెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒకసారి ఈ తప్పిదానికి పాల్పడ్డారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, సంజూ శాంసన్ (115 నాటౌట్) అద్భుత సెంచరీకి, జేమీ ఓవర్‌టన్ (4/18) అద్భుత బౌలింగ్ తోడవడంతో ఢిల్లీపై చెన్నై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. శాంసన్ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ శుభారంభం అందించినా, ఓవర్‌టన్ నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఇక‌, ఈ సీజన్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత సీఎస్కేకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

Ruturaj Gaikwad
Chennai Super Kings
CSK
IPL 2024
Slow Over Rate
Sanju Samson
Delhi Capitals
Chepauk Stadium
Shreyas Iyer
Shubman Gill

More Telugu News