‘శివాజీ సృష్టించిన చీర’.. మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం

నటుడు శివాజీ, యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య కొద్దిరోజులుగా సద్దుమణిగినట్లు కనిపించిన వస్త్రధారణ వివాదం మళ్లీ రాజుకుంది. అనసూయ తాజాగా చీరకట్టులో కనిపించడంపై ఓ మీడియా సంస్థ పెట్టిన క్యాప్షన్‌కు ఆమె ఇచ్చిన ఘాటు సమాధానం ఈ వివాదాన్ని మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చింది. తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తూ అనసూయ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..!
ఇటీవల అనసూయ తన భర్తతో కలిసి సాంప్రదాయబద్ధంగా పట్టుచీరలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, “శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ” అంటూ ఓ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ అనసూయ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా స్పందించారు.

ఆ మీడియా కథనాన్ని ఉద్దేశిస్తూ అనసూయ వ్యంగ్యంగా బదులిచ్చారు. “తప్పు తప్పు.. ‘శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ’ అని కదా హెడ్డింగ్ ఉండాలి. ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు” అంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె కామెంట్ సెక్షన్‌ను లాక్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందించే అవకాశం లేకుండా పోయింది.

వివాదానికి నేపథ్యం ఇదే..!
కొన్ని వారాల క్రితం ‘దండోరా’ అనే ఈవెంట్‌లో నటుడు శివాజీ మాట్లాడుతూ.. మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు నిండుగా దుస్తులు ధరించినప్పుడే అందంగా ఉంటారని, శరీరం కనిపించేలా బట్టలు వేసుకోవడం సరికాదని అన్నారు. అలాంటి వారిని చూసి బయటకు నవ్వినా, లోపల మాత్రం విమర్శిస్తారని చెప్పడం తీవ్ర దుమారం రేపింది.

ఆ సమయంలో శివాజీ వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. సమస్య దుస్తుల్లో లేదని, పురుషుల ఆలోచనా విధానంలో ఉందని ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో అనసూయకు పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాల నుంచి మద్దతు లభించింది. కొద్దిరోజులుగా ఈ వివాదం సద్దుమణిగినా, తాజాగా అనసూయ ఇచ్చిన కౌంటర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. 

Anasuya Bharadwaj
Sivaji
actress
social media
dress code
controversy
Telugu cinema
Dandora event
women's rights
clothing

More Telugu News