ఇరాన్‌తో చర్చలు విఫలం.. ఇది ఆ దేశానికే ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్

ఇరాన్‌తో అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటలకు పైగా సాగిన ఈ మంతనాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. అమెరికా పెట్టిన షరతులను టెహ్రాన్ తిరస్కరించడమే ఇందుకు కారణమని, ఇది అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని ఆయన హెచ్చరించారు.

ఇవాళ‌ తెల్లవారుజామున ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ వాన్స్ ఈ వివరాలు వెల్లడించారు. "మేము గత 21 గంటలుగా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాం. అనేక కీలక అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఇది మంచి విషయమే. కానీ, ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇదే చెడు వార్త" అని ఆయన స్పష్టం చేశారు. చర్చల్లో అమెరికా తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పిందని వాన్స్ తెలిపారు. "మా రెడ్ లైన్స్ ఏంటో స్పష్టం చేశాం. ఏయే అంశాల్లో సర్దుకుపోగలమో, ఏయే విషయాల్లో వెనక్కి తగ్గేది లేదో  స్ప‌ష్టం చేశాం. కానీ మా షరతులను అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు" అని ఆయన వివరించారు.

ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా నిరోధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని వాన్స్ నొక్కి చెప్పారు. "ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని, వాటిని వేగంగా సమకూర్చుకోగల సాధనాల జోలికి వెళ్లబోమని కచ్చితమైన, దీర్ఘకాలిక హామీ ఇవ్వాలి. కేవలం ఇప్పటికో, రెండేళ్లకో కాదు.. సుదీర్ఘ కాలం పాటు ఈ నిబద్ధతను మేము చూడాలనుకుంటున్నాం. కానీ, అది ఇప్పటివరకు మాకు కనిపించలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము చిత్తశుద్ధితో వ్యవహరించామని వాన్స్ పేర్కొన్నారు. "ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించమని అధ్యక్షుడు మాకు చెప్పారు. మేం అదే చేశాం. కానీ దురదృష్టవశాత్తు పురోగతి సాధించలేకపోయాం" అని అన్నారు. ఈ 21 గంటల చర్చల సమయంలో తాము నిరంతరం అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపామని, దాదాపు డజను సార్లు ఆయనతో మాట్లాడి ఉంటామని తెలిపారు.

ప్రస్తుతం తాము ఒక స్పష్టమైన ప్రతిపాదనతో చర్చల నుంచి వైదొలుగుతున్నామని, ఇదే తమ తుది, అత్యుత్తమ ఆఫర్ అని వాన్స్ స్ప‌ష్టం చేశారు. "మా తుది ఆఫర్‌ను వారి ముందు ఉంచాం. ఏం జరుగుతుందో చూద్దాం" అని ఆయన పేర్కొన్నారు. 

JD Vance
Iran nuclear deal
US Iran relations
Iran nuclear program
Islamabad talks
nuclear weapons
US foreign policy
Tehran
America

More Telugu News