హ‌ర్మూజ్ జలసంధిని క్లియర్ చేస్తున్నాం: ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు హ‌ర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి. ఈ కీలకమైన జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఈ ఘర్షణ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా నేవీకి చెందిన గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జలసంధిని దాటినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అయితే, ఈ ఆపరేషన్ కోసం టెహ్రాన్ అధికారులతో ఎలాంటి సమన్వయం చేసుకోలేదని యాక్సియోస్ అనే మరో మీడియా సంస్థ తెలిపింది.

ఈ అంశంపై తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ స్పందించారు. "మేము ఇప్పుడు హ‌ర్మూజ్ జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం" అని ఆయన తెలిపారు. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఇది మేలు చేస్తుందని, ఆ దేశాలకు ఈ పని చేసే ధైర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో ఇరాన్ భారీగా నష్టపోతోందని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ సముద్రంలో అమర్చిన మైన్‌ల వల్ల ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని అంగీకరించారు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ ఈ కీలక జలమార్గాన్ని దాదాపుగా దిగ్బంధించింది. ప్రపంచంలోని ముడిచమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ ఘర్షణకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల సీనియర్ అధికారులు పాకిస్థాన్‌లో నేడు చర్చలు ప్రారంభించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది.

Donald Trump
Hormuz Strait
Iran
US Navy
oil transport
Middle East tensions
maritime security
Persian Gulf
China
Japan

More Telugu News