టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం

CSK vs DC Delhi Capitals won the toss
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన సీఎస్కే, ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.

టాస్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. "పిచ్ బ్యాటింగ్‌కు బాగుంది, అందుకే ఛేదనకు మొగ్గు చూపుతున్నాం. లక్ష్యం ఎంత ఉన్నా ఛేదించడానికే ఇష్టపడతాం. జట్టులో వాతావరణం ప్రశాంతంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే మా జట్టు మరింత సమతూకంగా కనిపిస్తోంది. ఇది రెడ్ సాయిల్ పిచ్ కావడంతో మంచి బౌన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నాం. సీఎస్కేను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే మా లక్ష్యం" అని వివరించారు.

మరోవైపు, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "పిచ్ కాస్త పొడిగా ఉన్నట్లుంది. టాస్ విషయంలో మేం కూడా 50-50గా ఉన్నాం. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బ్యాటింగ్ విభాగం బాగానే ఆడుతోంది, కానీ కొన్ని కీలక సమయాల్లో విఫలమవుతున్నాం. డివాల్డ్ బ్రెవిస్ తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. మాట్ ఎడ్వర్డ్స్ స్థానంలో యువ బౌలర్ గుర్జప్‌నీత్ సింగ్‌కు అవకాశం ఇచ్చాం" అని తెలిపాడు.

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనీ గురించి రుతురాజ్ మాట్లాడుతూ.. "ధోనీ ప్రస్తుతం హోటల్‌లో ఉండి మాకు మద్దతు ఇస్తున్నారు. కానీ, చాలా త్వరలోనే మీరు అతడిని మైదానంలో చూస్తారు" అని చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అఖిబ్ నబీ దార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేశ్ కుమార్.
ఇంపాక్ట్ సబ్స్: విప్రాజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీశ్ రాణా.

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డివాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్‌నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ సబ్స్: మాథ్యూ షార్ట్, అకీల్ హోసేన్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, మాట్ హెన్రీ.
Go Back to Shorts
Axar Patel
Delhi Capitals
Chennai Super Kings
IPL 2026
Ruturaj Gaikwad
MS Dhoni
Cricket
Toss
MA Chidambaram Stadium
Indian Premier League

More Telugu News