ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శనివారం సాయంత్రం ఈ కీలక సమావేశం మొదలైనట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఖేర్ ఖలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి.

ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ తస్నిమ్ ప్రకారం, లెబనాన్‌లో పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలు, స్తంభింపజేసిన తమ ఆస్తులను అమెరికా విడుదల చేయడం, హర్మూజ్ జలసంధిపై చర్చలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉన్నాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా పాటించడం లేదని, దీనికి అమెరికా బాధ్యత వహించాలని ఇరాన్ బృందం డిమాండ్ చేస్తున్నట్లు తస్నిమ్ పేర్కొంది.

ఇదే సమయంలో ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్-రెజా అరెఫ్ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే ఎలాంటి ఒప్పందం కుదరదని స్పష్టం చేశారు. "చర్చల్లో ఇజ్రాయెల్ అజెండాపై మాట్లాడాల్సి వస్తే, ఎలాంటి ఒప్పందం ఉండదు. మా రక్షణ చర్యలను మరింత తీవ్రతరం చేస్తాం" అని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి, సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారం నుంచి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడి చేసి 300 మందికి పైగా పౌరులను చంపింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఇరాన్ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందని తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, ఈ వార్తలను అమెరికా సీనియర్ అధికారి ఒకరు ఖండించినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి.

Iran
Iran US talks
America Iran
Israel
Lebanon
Hormuz Strait
Mohammad Bagher Ghalibaf
Middle East tensions
US Iran relations
Nuclear deal

More Telugu News