రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: కేటీఆర్

తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేద ప్రజల భూములను అరాచకంగా లాక్కుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్... ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం న్యాయానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ, అక్రమంగా చైర్మన్ పదవులను దక్కించుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సాగలేదని అన్నారు.


ముఖ్యంగా 'ఫోర్త్ సిటీ', 'ఫ్యూచర్ సిటీ' పేరుతో రేవంత్ రెడ్డి భారీ భూ దందాకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అదే భూముల్లో కొత్త నగరాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. భట్టి విక్రమార్క, సీతక్క వంటి నేతలు పాదయాత్రలు చేసి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు అదనంగా మరో 16,000 ఎకరాలను సేకరించాలని చూడటం వెనుక రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరుల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. ఉన్న సిటీలో దోమల నివారణ కూడా చేయలేని ప్రభుత్వం, ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతామంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


ఇక నిషేధిత భూముల జాబితాను (22A) అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత భూముల సంఖ్యను ఏకంగా కోటి ఎకరాలకు పెంచి, భూ యజమానులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్లు చేస్తూ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు పెచ్చుమీరాయని, హోటళ్లు, బార్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడకుండా నిలబడిన కార్యకర్తలకు అండగా ఉంటామని, నిబంధనలు అతిక్రమించి కాంగ్రెస్‌కు వత్తాసు పలికే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.


KTR
Revanth Reddy
Telangana
BRS
Congress
Land Scam
Ibrahimpatnam
Ponguleti Srinivas Reddy
Bhhatti Vikramarka
Future City

More Telugu News