పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే

India accounts for 49 pc of global real time digital payments as UPI turns 10
షార్ట్స్‌లో చూడండి
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీల్లో ఏకంగా 49 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది.

గణాంకాల ప్రకారం కేవలం 2026 జనవరి నెలలోనే యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 28.33 లక్షల కోట్లు. దేశంలోని మొత్తం రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో 81 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రారంభమైన నాటి నుంచి లావాదేవీల పరిమాణంలో 12,000 రెట్లు, విలువలో 4,000 రెట్లకు పైగా వృద్ధిని యూపీఐ నమోదు చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సైతం యూపీఐని ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అభివర్ణించింది.

కేవలం లావాదేవీల సంఖ్యకే పరిమితం కాకుండా యూపీఐ సామాన్యుడి జీవితంలో భాగమైంది. ఆటోరిక్షా డ్రైవర్ల నుంచి వీధి వ్యాపారులు, గ్రామీణ మార్కెట్ల వరకు దీని సేవలు విస్తరించాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, అధికారిక, అనధికారిక ఆర్థిక వ్యవస్థల మధ్య అంతరాన్ని తగ్గించి, ఆర్థిక సమ్మిళితత్వానికి మార్గం వేసిందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.

భారత యూపీఐ వ్యవస్థ పనితీరు, భద్రత, వేగాన్ని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయి. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ సహా 8 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యూపీఐ లైట్, యూపీఐ ఆటోపే, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి కొత్త సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. దశాబ్ద కాలంలోనే దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలవడం గమనార్హం.


Go Back to Shorts
UPI
Unified Payments Interface
digital payments
India
real-time transactions
digital economy
financial inclusion
UPI transactions
RuPay
digital India

More Telugu News