శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార, శ్రీలంక క్రికెట్ బోర్డు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐపీఎల్‌లో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నిరాకరించినందుకు బోర్డుపై కోర్టుకు వెళ్లిన తుషార, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని బోర్డుకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తన చర్యల వల్ల బోర్డుకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు పేర్కొంటూ ఎస్‌ఎల్‌సీకి ఈమెయిల్ పంపడమే కాకుండా, కోర్టులో వేసిన కేసును కూడా ఉపసంహరించుకున్నాడు.
శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది తమ ఆటగాళ్ల కోసం కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలను తప్పనిసరి చేసింది. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి కావాలంటే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనివార్యమని స్పష్టం చేసింది. అయితే, తుషార ఈ ఫిట్‌నెస్ పరీక్షల్లో అర్హత సాధించలేకపోయాడు. దీంతో, నిబంధనల ప్రకారం బోర్డు అతనికి ఎన్వోసీ ఇవ్వడానికి నిరాకరించింది. బోర్డు నిర్ణయం తన పట్ల పక్షపాతంగా ఉందని భావించిన తుషార, న్యాయస్థానాన్ని ఆశ్రయించి బోర్డుతో నేరుగా తలపడ్డాడు.
దేశం తరఫున ఆడటం కంటే ప్రైవేట్ లీగ్ కోసం బోర్డుతోనే పోరాటానికి దిగడంపై క్రీడా వర్గాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి తోడు బోర్డు నిబంధనలు కఠినంగా ఉండటంతో, తన కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని తుషార వెనక్కి తగ్గాడు. బోర్డు నియమాలకు లోబడి ఉండటమే శ్రేయస్కరమని భావించి ఈ వివాదానికి ముగింపు పలికాడు.
31 ఏళ్ల నువాన్ తుషార తన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో (లసిత్ మలింగ తరహాలో) గుర్తింపు పొందారు. 2024లో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాతి సీజన్‌లో ఆర్సీబీ జట్టుకు ఎంపికయ్యారు.