కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక

కర్ణాటకకు విహార యాత్రకు వచ్చిన కేరళకు చెందిన 14 ఏళ్ల బాలిక అదృశ్యం విషాదాంతమైంది. నాలుగు రోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత, చిక్కమగళూరులోని చంద్రద్రోణ కొండల్లోని లోయలో ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేరళలోని పాలక్కడ్‌కు చెందిన శ్రీ నంద (14) పదో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 7న దాదాపు 40 మంది బంధువులతో కలిసి ఆమె కర్ణాటక పర్యటనకు వచ్చింది. మొదట హంపిని సందర్శించిన వీరు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు చిక్కమగళూరు చేరుకున్నారు. ప్రైవేట్ జీపుల్లో చంద్రద్రోణ కొండల్లోని ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని, ఆ తర్వాత మాణిక్యధార ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో చీకటి పడుతుండగా శ్రీ నంద అదృశ్యమైంది.

కుటుంబ సభ్యులు మొదట గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, కొండల నడుమ ఉన్న లోతైన ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు ఉపయోగించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు, నాలుగు రోజుల నిరంతర గాలింపు తర్వాత మాణిక్యధార వ్యూపాయింట్‌కు దాదాపు 1500 అడుగుల దిగువన లోయలో శ్రీ నంద మృతదేహాన్ని కనుగొన్నారు.

బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ.. కిడ్నాప్ జరిగిందనే వాదనతో పాటు, బాలిక ఎవరితోనైనా వెళ్లిపోయి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని, నిజానిజాలు త్వరలో తేలుతాయని చెప్పారు. పోలీసులు బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆమె కొండపై నుంచి జారిపడిందా? లేక మరేదైనా కారణం ఉందా? అని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కొడగులో ట్రెక్కింగ్‌కు వెళ్లిన కేరళకు చెందిన జీఎస్ శరణ్య అనే మహిళా టెక్కీ కూడా నాలుగు రోజుల పాటు అడవిలో తప్పిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కేవలం నీళ్లు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకోగా, అధికారులు ఆమెను సురక్షితంగా రక్షించారు. ఇప్పుడు శ్రీ నంద విషయంలో విషాదం చోటుచేసుకోవడం విచారకరం.

Sri Nanda
Karnataka trip
Chikkamagaluru
Kerala girl missing
Manikyadhara
Chandradrona hills
Trekking accident
Kidnapping case
Karnataka police
G Parameshwara

More Telugu News