యూపీఐ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త రూల్.. రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే!

RBI Proposes Delay for UPI Payments Over Rs 10000
షార్ట్స్‌లో చూడండి
డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీ ఎం వంటి యాప్‌ల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (పీ2పీ) రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపినప్పుడు, ఆ మొత్తం అవతలి వారికి వెంటనే చేరదు. కనీసం గంట సమయం తర్వాతే వారి ఖాతాలో జమ అవుతుంది. ఆన్‌లైన్ మోసాలు, ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్న సీనియర్ సిటిజన్లను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.

రూ.10,000 దాటితే యూపీఐ పేమెంట్స్ హోల్డ్
యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా జరిపే రూ.10,000కు పైబడిన లావాదేవీలకు ఈ గంట సమయం నిబంధనను వర్తింపజేయాలని ఆర్‌బీఐ సూచించింది. పొరపాటున లేదా మోసపోయి డబ్బు పంపినట్టు గుర్తిస్తే, ఈ గంట సమయంలోగా ఆ లావాదేవీని రద్దు చేసుకునే వెసులుబాటు వినియోగదారుడికి ఉంటుంది. అయితే, దుకాణాలు, ఇతర గుర్తింపు పొందిన వ్యాపారులకు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు. వాటికి యథావిధిగా తక్షణమే డబ్బు బదిలీ అవుతుంది.

వారికి 'వైట్‌లిస్టింగ్' ఫీచర్‌ 
దీంతో పాటు 'వైట్‌లిస్టింగ్' అనే ఫీచర్‌ను కూడా తీసుకురావాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. దీని ద్వారా వినియోగదారులు తాము తరచూ, నమ్మకంగా డబ్బు పంపే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల అకౌంట్లను ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. వైట్‌లిస్ట్‌లోని వారికి రూ.10,000 పైబడి పంపినా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే డబ్బు బదిలీ అవుతుంది. ఈ ప్రతిపాదనలపై మే 8వ తేదీలోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఆర్‌బీఐ ప్రజలను కోరింది. గత నాలుగేళ్లలో సైబర్ క్రైమ్ కేసులు పది రెట్లు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Go Back to Shorts
UPI Payments
RBI
digital payments
online fraud
cyber crime
IMPS
Reserve Bank of India
UPI new rules
whitelist feature
digital transactions

More Telugu News