పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు.. శాంతి చర్చలకు సర్వం సిద్ధం

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఖర్ ఖలీబాఫ్ నేతృత్వంలోని బృందం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న అత్యంత ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం.

అయితే, ఈ చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ కొన్ని కఠినమైన షరతులు విధించింది. తమ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని స్పష్టం చేసింది. లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని, తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసి, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ ప్రతినిధి బృందంలో పార్లమెంట్ స్పీకర్‌తో పాటు విదేశాంగ మంత్రి, రక్షణ మండలి కార్యదర్శి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వంటి కీలక అధికారులు ఉన్నారు.

మరోవైపు అమెరికా బృందంలో ఉపాధ్యక్షుడు వాన్స్‌తో పాటు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఉన్నారు. అయితే ఈ చర్చల ద్వారా వెంటనే సానుకూల ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద హర్మూజ్ జలసంధిని త్వరగా తెరుస్తారన్న ఆశలు తక్కువగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి.

ఇరు దేశాల డిమాండ్లలో చాలా వ్యత్యాసం ఉంది. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని, హర్మూజ్ జలసంధిపై తమకు అధికారం ఇవ్వాలని ఇరాన్ కోరుతుండగా, యురేనియం నిల్వలు, క్షిపణులను వదులుకోవాలని, నిర్బంధంలో ఉన్న తమ పౌరులను విడుదల చేయాలని అమెరికా పట్టుబడుతోంది. 

Mohammad Bagher Ghalibaf
Iran
USA
Pakistan
Iran US talks
nuclear deal
Hormuz Strait
economic sanctions
JD Vance
Israel Hezbollah

More Telugu News