మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలతో ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు.


అయితే, అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి, ప్రభుత్వ సమాచారం లీక్ అవుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ అజెండా, ఇతర రహస్య వివరాలు సమావేశానికి ముందే బయటకు రావడంపై మంత్రులను నిలదీశారు. గతంలో ఇలాంటి లీకుల కారణంగానే ఎన్టీఆర్ తన కేబినెట్‌ను రద్దు చేయాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే సంబంధిత మంత్రులనే బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.


ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘జలధార’ పథకం ప్రయోజనాలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు. భూములకు సంబంధించిన పాస్‌బుక్స్ పంపిణీ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని... మంత్రులు, అధికారులు నెలకు కనీసం నాలుగు సార్లు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ‘సూర్య ఘర్’ పథకం లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులకు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లు అంశంపై కూడా కేబినెట్‌లో ప్రాథమిక చర్చ జరిగింది.


రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. పరిపాలనలో పారదర్శకత పెంచాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పథకాల అమలులో వేగం పెంచాలని ముఖ్యమంత్రి మంత్రులకు నిర్దేశించారు. 


ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమాల వివరాలు గోప్యంగా ఉంచాలని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.


Chandrababu Naidu
Andhra Pradesh cabinet
AP cabinet meeting
government information leak
Jaladhara scheme
Surya Ghar scheme
municipal elections
women's bill
AP politics
TDP

More Telugu News