నీవు నా కొడుకు కెరీర్ ముగించేశావు: క్రిస్ బ్రాడ్ ఆవేదన.. యువీ రియాక్షన్!

2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం. అయితే ఆ ఘటన తర్వాత మైదానం వెలుపల జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను యువీ ఇటీవల 'ది ఓవర్ లాప్' షోలో పంచుకున్నాడు. ఆ సిక్సర్ల వర్షం స్టువర్ట్ బ్రాడ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిందో, అతని తండ్రి క్రిస్ బ్రాడ్ ఎలా స్పందించారో యువీ వివరించాడు.


ఆ మ్యాచ్‌కు రిఫరీగా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ ముగిశాక యువరాజ్ వద్దకు వచ్చి, "నువ్వు దాదాపు నా కొడుకు కెరీర్‌ను ముగించేశావు" అని అన్నారట. ఒక తండ్రిగా తన కొడుకు పడుతున్న బాధను ఆయన అలా వ్యక్తం చేశారు. దానికి యువీ స్పందిస్తూ.. "సర్, గతంలో నా బౌలింగ్‌లో కూడా ఐదు సిక్సర్లు పడ్డాయి, ఆ బాధ నాకు తెలుసు" అని ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశాడు.


ఆ తర్వాత క్రిస్ బ్రాడ్ కోరిక మేరకు ఒక జెర్సీపై యువీ సంతకం చేస్తూ.. "నువ్వు భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతావని ఆశిస్తున్నాను" అని రాసిచ్చాడు. అయితే, ఆ జెర్సీని స్టువర్ట్ బ్రాడ్ కోపంతో డస్ట్‌బిన్‌లో పడేశాడని యువీకి ఇటీవల తెలిసింది. "అంతటి అవమానం జరిగినప్పుడు ఆ కోపం రావడం సహజమే, అది తప్పు కాదు" అని యువీ చాలా పరిణతితో స్పందించాడు. ఆ ఎదురుదెబ్బతో కుంగిపోకుండా బ్రాడ్ 600 పైగా టెస్ట్ వికెట్లు తీసి లెజెండరీ బౌలర్‌గా ఎదగడం గొప్ప విషయమని యువీ కొనియాడాడు.


Yuvraj Singh
Stuart Broad
Chris Broad
T20 World Cup 2007
Six Sixes
Cricket
England Cricket
Cricket History
The Overlap Show
Test Cricket

More Telugu News