చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్!

Stolen Bike Found After 3 Months Due to Challan Photo Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం చోరీకి గురైన ఓ ద్విచక్ర వాహనం, దానికి వచ్చిన ట్రాఫిక్ చలాన్‌లోని ఫొటో ఆధారంగా దొరికింది. బాధితుడు సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్ పోలీసులను అప్రమత్తం చేసి, వాహనాన్ని రికవరీ చేసేలా చేసింది.

ఫైసల్ రెహమాన్ అనే వ్యక్తికి చెందిన స్కూటర్ జనవరి 24న చోరీకి గురైంది. దీనిపై ఆయన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఏప్రిల్ 7న తన వాహనానికి హెల్మెట్ లేదని ట్రాఫిక్ చలాన్ వచ్చినట్టు ఆయన గమనించారు. ఆ చలాన్‌లోని ఫొటోలో బండి నడుపుతున్న వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఆ ఫొటోను జతచేస్తూ "ఇతడే ఆ దొంగ" అంటూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫైసల్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. నిజానికి ఈ కేసుపై అప్పటికే దర్యాప్తు చేస్తున్నామని, అయితే సోషల్ మీడియా పోస్ట్ వల్ల నిందితుడు అప్రమత్తమయ్యే ప్రమాదం ఉందని పోలీసులు మొదట భావించారు. అయినప్పటికీ, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టారు. గురువారం వాహనాన్ని గుర్తించి, దానిని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి అసలు దొంగా? లేక చోరీ వాహనాన్ని తెలియక కొనుగోలు చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన వాహనం దొరకడంతో ఫైసల్ రెహమాన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో, వాహనం చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసినా యజమానులకు చలాన్లు ఎందుకు వస్తున్నాయని, చోరీ వాహనాలను గుర్తించే వ్యవస్థను మెరుగుపరచాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Go Back to Shorts
Faisal Rehman
Hyderabad
bike theft
traffic challan
Habibnagar police
stolen vehicle
social media
X post
CCTV footage
vehicle recovery

More Telugu News