రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' వచ్చేసింది!

Royal Enfield Flying Flea C6 First Electric Bike Launched
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను గురువారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' (Flying Flea C6) పేరుతో విడుదలైన ఈ బైక్‌ను, కంపెనీ తన కొత్త సబ్-బ్రాండ్ 'సిటీ+ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ' కింద పరిచయం చేసింది. నగరాల్లోని యువత, రోజువారీ రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ధర, లభ్యత
ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.2.79 లక్షలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్ణయించింది. అయితే, వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానాన్ని ఎంచుకుంటే, వినియోగదారులు కేవలం రూ.1.99 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఏప్రిల్ 10 నుంచి ఈ బైక్‌కు సంబంధించిన బుకింగ్‌లు ప్రారంభం కానుండగా, మే నెల నుంచి డెలివరీలను మొదలుపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

పర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్స్
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ బైక్‌లో 3.91 కిలోవాట్ అవర్ (kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి 15.4kW పీక్‌ పవర్‌ను ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ (PMSM)ను జత చేశారు. ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కేవలం 3.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని IDC (ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) స్టాండర్డ్స్ ప్రకారం కంపెనీ తెలిపింది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

డిజైన్, ఫీచర్లు
నగర ప్రయాణాలకు అనువుగా ఈ బైక్‌ను కాంపాక్ట్, ఆధునిక డిజైన్‌లో తీర్చిదిద్దారు. ఫ్రేమ్‌ మొత్తం బయటికి కనిపించేలా చేసిన డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణ ఇస్తోంది. ఫ్లోటింగ్ సీటు, అవసరం లేనప్పుడు తీసివేయగల పిల్లియన్‌ సీటు వంటివి దీని డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అధునాతన ఫీచర్ల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏమాత్రం రాజీ పడలేదు. 

ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, గూగుల్ భాగస్వామ్యంతో పనిచేసే ఆన్‌బోర్డ్ నావిగేషన్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వంటివి ఉన్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తూ కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు. రైడర్ తన ఇష్టానుసారం స్పోర్ట్, ఇండివిడ్యువల్ వంటి రైడింగ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు.

తేలికైన బైక్‌గా రికార్డ్
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 మోడల్‌లో ప్రధాన ప్రత్యేకత దాని బరువు. ఈ బైక్ బరువు కేవలం 124 కిలోలు మాత్రమే. ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన మోటార్‌సైకిళ్లలో ఇదే అత్యంత తేలికైనది కావడం గమనార్హం. ఈ మోడల్ ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో తమదైన ముద్ర వేయాలని, భారత ఈవీ మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Go Back to Shorts
Royal Enfield
Flying Flea C6
Royal Enfield Electric Bike
Electric Motorcycle
EV Bike India
City+ Electric Mobility
Electric Vehicle
BaaS
Electric Bike Price
Lightweight Bike

More Telugu News