బిట్‌కాయిన్ ఇస్తేనే దారి.. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్!

ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తిస్థాయి పట్టు బిగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని, ఆయుధాల తరలింపును నిరోధిస్తున్నామనే పేరుతో సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. నౌకల రాకపోకలను తీవ్రంగా నియంత్రిస్తూ, టోల్ ఫీజును క్రిప్టో కరెన్సీలో వసూలు చేస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇరాన్ కొత్త నిబంధనల ప్రకారం, సాధారణంగా రోజుకు 100కు పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ఇకపై కేవలం 12 నౌకలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో పర్షియన్ గల్ఫ్‌లో వందలాది నౌకలు నిలిచిపోయి ఆ ప్రాంతం ఒక ‘పార్కింగ్ లాట్’ ను తలపిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ ‘ట్రాన్సిట్ టోల్’ వసూలు చేస్తోంది. ఈ చెల్లింపులను డాలర్లలో కాకుండా బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు లేదా చైనా యువాన్లలో మాత్రమే చేయాలని షరతు విధించింది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే ఇరాన్ ఈ డిజిటల్ చెల్లింపుల మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

చమురు ట్యాంకర్లలోని ప్రతి బ్యారెల్ ముడి చమురుపై 1 డాలర్ చొప్పున టోల్ వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో భారీ ట్యాంకర్‌పై దాదాపు 2 మిలియన్ డాలర్ల (సుమారు ₹16.7 కోట్లు) భారం పడుతోంది. నౌకాయాన సంస్థలు తమ సరుకు వివరాలను ఈమెయిల్ చేయగానే, ఇరాన్ పంపిన పేమెంట్ లింక్‌పై సెకన్ల వ్యవధిలో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలమార్గంపై ఇలాంటి ‘గేట్ కీపింగ్’ చట్టవిరుద్ధమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మండిపడ్డారు. సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బుధవారం కేవలం 4 నౌకలనే అనుమతించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Iran
Hormuz Strait
Bitcoin
Oil Tankers
Cryptocurrency
Persian Gulf
Marco Rubio
Saudi Arabia
China Yuan
Transit Toll

More Telugu News