కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు

'వికసిత్ భారత్' పేరుతో సైబర్ మోసగాళ్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మోసం చేశారు. ఎమ్మెల్యేకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ 'వికసిత్ భారత్' పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నమ్మబలికాడు.

జనగామ నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపించాలని, దరఖాస్తుకు ఈరోజే గడువు ముగుస్తుందని నమ్మించాడు. ఒక్కో దరఖాస్తుకు రూ.2,500 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని, నలభై మందికి రూ.1 లక్ష వెంటనే పంపిస్తే దరఖాస్తు చేస్తానని చెప్పాడు. నియోజకవర్గంలోని అర్హులకు రుణాలు వస్తే స్వయం ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో నిందితుడు చెప్పిన నెంబర్‌కు ఎమ్మెల్యే డబ్బులు పంపించారు.

లక్ష రూపాయలు పంపించిన తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చి, ఎమ్మెల్యే ఆరా తీయగా, అది నకిలీ కాల్ అని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Palla Rajeshwar Reddy
Janagaon MLA
Viksit Bharat
Cyber Fraud
Telangana Finance Department

More Telugu News