ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో!

Employee Sets Fire to Kimberly Clark Warehouse in California
షార్ట్స్‌లో చూడండి
జీతం సరిపోవడం లేదన్న అసంతృప్తో లేక బాస్ పై కోపమో.. ఓ ఉద్యోగి చేసిన పని మొత్తం కంపెనీని నష్టాల పాలు చేసింది. కంపెనీ గోడౌన్ లో ప్యాక్ చేసిన టాయిలెట్ పేపర్ల బండిల్ కు ఆ ఉద్యోగి నిప్పు పెట్టాడు. దీంతో మంటలు విస్తరించి మొత్తం గోడౌన్ ను బూడిద చేశాయి. మంటలు ఆర్పేందుకు ఏకంగా 175 ఫైరింజన్లు వచ్చాయంటే అగ్ని ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అంటారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ప్రపంచ ప్రఖ్యాత 'కింబర్లీ-క్లార్క్' సంస్థకు చెందిన గోడౌన్ లో చామెల్ అబ్దుల్ కరీం (29) అనే ఉద్యోగి మంగళవారం తెల్లవారుజామున టాయిలెట్ పేపర్ బండిళ్లకు లైటర్‌తో నిప్పుపెట్టాడు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. 

గోదాంలో పేపర్ ఉత్పత్తులు ఉండటంతో మంటలు క్షణాల్లో భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దీనిని '6-అలారం ఫైర్'గా ప్రకటించి, ఏకంగా 175 ఫైరింజన్లు, వందలాది మంది సిబ్బందితో మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి శ్రమించారు. అయినప్పటికీ 1.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాం పైకప్పు కూలిపోయి, లోపలున్న సరుకంతా బూడిదైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 20 మంది ఉద్యోగులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనకు కారణమైన చామెల్ అబ్దుల్ కరీంను పోలీసులు అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అమెరికా వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో టాయిలెట్ పేపర్, టిష్యూల సరఫరాపై ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Chamel Abdul Karim
Kimberly Clark
California fire
warehouse fire
toilet paper
arson
Ontario California
fire accident
crime

More Telugu News