గాజువాక మౌనిక కేసులో కొత్త ట్విస్ట్.. ఫ్రెండ్ రూంలోనే హత్య!

విశాఖపట్నంలోని గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్ర ఫ్లాట్‌లో హత్య జరగలేదని, అతడి స్నేహితుడి ఇంట్లో జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో తన ఫ్లాట్‌కు తరలించి ముక్కలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

నేవీలో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు, మౌనికకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. మార్చి 29న ఆమెను హత్య చేసినట్లు రవీంద్ర తొలుత పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. మర్రిపాలెం నుంచి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లానని, అక్కడ గొడవ జరగడంతో చంపేశానని చెప్పాడు. అయితే, రవీంద్ర నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా, మౌనిక లోపలికి వచ్చిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని కస్టడీలోకి తీసుకుని తమడైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు.

తనకు పెళ్లయిన విషయం మౌనికకు తెలియకూడదనే ఉద్దేశంతో రవీంద్ర ఈ నాటకం ఆడినట్లు తేలింది. తన ఫ్లాట్‌కు దగ్గరలోనే నివసించే స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకుని, అదే తన ఇల్లని చెప్పి మౌనికను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరగడంతో, ఆమె అరవకుండా నోరు నొక్కి, మోకాలితో గొంతుపై బలంగా తొక్కడంతో మౌనిక మృతి చెందింది.

అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉంచి, తన ఫ్లాట్‌కు వెళ్లి ఓ పెద్ద ట్రాలీ బ్యాగ్‌తో తిరిగి వచ్చాడు. మృతదేహాన్ని అందులో కుక్కి, ఎవరికీ అనుమానం రాకుండా తన ఫ్లాట్‌కు తరలించాడు. ఆన్‌లైన్‌లో కత్తులు ఆర్డర్ చేసి, బాత్రూంలో శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత వాటిని జీడితోటలో పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడు రవీంద్రను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని కేంద్ర కారాగారానికి తరలించింది. అవసరమైతే మరోసారి కస్టడీకి కోరతామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు.

Ravindra
Mounika murder case
Gajuwaka
Visakhapatnam crime
dating app murder
Andhra Pradesh news
crime news
murder investigation
body disposal
police investigation

More Telugu News