సీమకు వైఎస్సార్ దేవుడు.. బాబు ద్రోహి: గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం
రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీమకు సాగునీరు అందిందంటే అది కేవలం వైఎస్సార్ చొరవతోనే సాధ్యమైందని అన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు కుదించి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతూ రాయలసీమ గొంతు కోస్తున్నా చంద్రబాబు నోరెత్తకపోవడం ఆయన విద్వేషానికి నిదర్శనమని మండిపడ్డారు.
అమరావతిని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని, తన బినామీలకు దోచిపెట్టడానికే లక్షల కోట్లు అక్కడ కుమ్మరిస్తున్నారని విమర్శించారు. జనం లేని చోట కొత్త సిటీల నిర్మాణం సాధ్యం కాదని, నయా రాయపూర్‌లో అభివృద్ధి శూన్యమని గుర్తుచేశారు. రాయలసీమలో వసూలు చేసే పన్నులను అమరావతిలో ఖర్చు చేస్తే తమ ప్రాంత పరిస్థితి ఏంటని నిలదీశారు. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. వైఎస్సార్, జగన్ హయాంలోనే అనంతపురం వంటి కరవు ప్రాంతాల్లో చెరువులు నిండాయని, హార్టికల్చర్ అభివృద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు.
గతంలో ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్... ఇప్పుడు చంద్రబాబుకు జాకీలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.