ఇరాన్‌తో ఒప్పందం.. నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో తిరుగుబాటు!

ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. ఇరాన్‌ను సమూలంగా దెబ్బతీస్తానని ప్రకటించి, మధ్యలోనే యుద్ధ విరమణకు అంగీకరించడంపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ‘చారిత్రక తప్పిదం’ అంటూ ప్రతిపక్షాలు, రక్షణ రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ ఒప్పందం ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ వైఫల్యమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సైన్యం సమర్థవంతంగా పోరాడుతున్నప్పటికీ, నెతన్యాహు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశం ఈ దుస్థితికి చేరిందని వారు మండిపడుతున్నారు. ఇరాన్‌పై పూర్తిస్థాయి విజయం సాధించకుండానే వెనక్కి తగ్గడం, ఆ దేశ దూకుడుకు తలొంచడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విరామ సమయాన్ని ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను పునరుద్ధరించుకోవడానికి వాడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్లే నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల ఇజ్రాయెల్ స్వతంత్ర రక్షణ విధానం దెబ్బతిన్నదని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఒప్పందం నుంచి హెజ్బుల్లాను మినహాయించినప్పటికీ, ఇరాన్‌కు ఊరటనివ్వడం వల్ల ప్రాంతీయంగా ముప్పు తొలగిపోదని స్పష్టం చేస్తున్నారు.

గత కొన్ని వారాలుగా బాంబు షెల్టర్లలోనే తలదాచుకుంటున్న ప్రజల్లో ఈ ఒప్పందంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు జరుగుతున్నాయి. సొంత కేబినెట్‌లోని మంత్రులు కూడా ఈ ఒప్పందంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుండటంతో నెతన్యాహు ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు వారాల విరామం తర్వాత యుద్ధం మళ్లీ మొదలవుతుందా లేక ప్రభుత్వం కూలిపోతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Benjamin Netanyahu
Israel
Iran deal
ceasefire agreement
political crisis
Donald Trump
Hezbollah
Tel Aviv
Israel politics

More Telugu News