మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న వేళ, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ 'రెడ్ లైన్స్' (హద్దులు) దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని, తమ స్పందన మధ్యప్రాచ్యం దాటి విస్తరిస్తుందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది.

ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులతో పాటు డ్రోన్లతో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని రెండు అమెరికన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లపై, ఇజ్రాయెల్ సైనిక సామగ్రి రవాణా చేస్తున్న ఓడపై కూడా కచ్చితమైన దాడులు చేశామని తెలిపింది. పౌర లక్ష్యాలపై తాము దాడి చేయబోమని, కానీ తమ పౌర సదుపాయాలపై దాడులు జరిగితే మాత్రం వెనక్కి తగ్గేది లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చిచెప్పింది.

మధ్యప్రాచ్యం ప్రాంతంలోని ఆయిల్, గ్యాస్ సౌకర్యాలను సంవత్సరాల తరబడి పనిచేయకుండా నాశనం చేయగలమని కూడా ఇరాన్ బెదిరించింది. అమెరికా మిత్రదేశాల విషయంలో ఇప్పటివరకు తాము సంయమనం పాటించామని, ఇకపై ఆ నియంత్రణలు ఉండవని స్పష్టం చేసింది. 

మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది. అది తిరిగి ఎప్పటికీ పునరుద్ధరించబడదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది," అని పేర్కొన్నారు. ఇరాన్‌లో సంపూర్ణ పాలన మార్పు జరగనుందని, వివేకవంతులైన నేతలు అధికారంలోకి వస్తే అద్భుతాలు జరగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. "ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటి. 47 ఏళ్ల ఇరాన్ దోపిడీ, అవినీతి, మరణాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది" అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ.. "పశుబలం ప్రదర్శించే తర్కం ఓడిపోవడం ఖాయం. మా నాగరిక దేశ సంస్కృతి, తర్కం, విశ్వాసాల శక్తి కచ్చితంగా గెలుస్తుంది. మా హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి మా సర్వశక్తులూ ఒడ్డుతాం. ఇరాన్ గెలుస్తుంది," అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్లో 90 శాతం జరిగే ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు చేసింది. గతంలో ఈ దీవిపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.



Iran
Donald Trump
Middle East tensions
IRGC
US military bases
Israel
Hormuz Strait
oil exports
Kharg Island
ballistic missiles

More Telugu News