'మావిగన్' నుంచి డైవర్షన్ కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు: జగన్

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించారని, ఇది మహిళలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శ కాదని, మహిళల ఆత్మగౌరవంపై చేసిన దాడిగా భావించాలని ఆయన అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

జగన్ ట్వీట్ ఇదే...!

"రేపు వైయస్‌ జగన్ మోహన్ ‌రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైసీపీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. 

ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో 'మావిగన్ (MAVIGUN)' ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. 

'మావిగన్ (MAVIGUN)' ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు. మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాం. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. 

ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం" అంటూ జగన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 



Jagan Mohan Reddy
ABN Radha Krishna
Vemuri Radha Krishna
YSRCP
MAVIGUN
Chandrababu Naidu
Lokesh
Pawan Kalyan
Andhra Jyothy
Telugu News

More Telugu News