కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Focuses on College Education Reforms and Housing Construction
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో, వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరి, వారిలో సంతృప్తి కలిగించేలా సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఆయన వివిధ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఇళ్ల నిర్మాణం, ఇసుక సరఫరాపై కీలక ఆదేశాలు 

ఈ ఏడాది మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు, ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. సర్వే ప్రకారం సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి వీలైనంత త్వరగా స్థలాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇక, వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే నిల్వలు పెంచుకోవాలని చెప్పారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నందున, రవాణా పేరుతో రీచ్‌ల వద్ద, స్టాక్ యార్డుల వద్ద అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాలేజీ విద్యలో సమూల మార్పులు 

రాష్ట్రంలో కాలేజీ విద్యను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. కాలేజీ విద్యలో రీ-ఓరియెంటేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలతో నిరంతరం అనుసంధానమవుతూ, సాంప్రదాయ కోర్సులతో పాటు పరిశ్రమల అవసరాలకు తగిన డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా కరిక్యులమ్‌ను రీ-స్ట్రక్చర్ చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగులు మరింత మెరుగుపడాలని, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలు కూడా ఈ దిశగా కృషి చేయాలని సూచించారు. ఉన్నత విద్యామండలి (హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్) మరింత చురుగ్గా వ్యవహరించాలని చెప్పారు.

ప్రజా భద్రతకు పెద్దపీట.. ప్రమాదాల నివారణపై దృష్టి 

మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి ఫిర్యాదులకు తావుండకూడదని సీఎం స్పష్టం చేశారు. క్రీడల ప్రోత్సాహానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) తన కార్యకలాపాలను పెంచాలని, 5కే రన్ వంటి కార్యక్రమాలతో యువతలో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అన్నారు. 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి ముందు, హెల్మెట్ వాడకం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్, కేబుల్ తీగలు వేలాడటం వల్ల జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గట్టిగా హెచ్చరించారు.

పిడుగుపాటు హెచ్చరికలు... అవేర్ 2.0 యాప్ ఆవిష్కరణ

పిడుగుపాటు వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ముందస్తు హెచ్చరికలు పంపుతున్నా, మరణాలు సంభవించడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీని వినియోగించడంతో పాటు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఫలానా టవర్ లొకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు తెలియజేసే వ్యవస్థను పరిశీలించాలని ఆదేశించారు. 

సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన ‘అవేర్ 2.0’ మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
housing scheme
college education
road accidents
sand supply
Aware 2.0 app
TIDCO houses
higher education
lightning alerts

More Telugu News