గతంలో చేసిన తప్పే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు
అభివృద్ధి వికేంద్రీకరణే అసలైన ప్రజాస్వామ్యమని, కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆయన ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
గతంలో హైదరాబాద్‌పైనే నిధులు కుమ్మరించడం వల్ల ఏపీకి నష్టం జరిగిందని, ఇప్పుడు అమరావతి విషయంలో చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారని హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ సూచనలను పెడచెవిన పెట్టడం సరికాదన్నారు. నిపుణుల కమిటీ నివేదికలను కాదని, రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చారని ఆరోపించారు. దీని కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయించారని పేర్కొన్నారు.
80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళుతున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రూ. 3.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ. 1,000 కోట్లు కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.
అమరావతి మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా సీఎం చెబుతున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు.