ఈ రాత్రికి ఓ జాతి మొత్తం అంతమైపోతుంది... ఇరాన్ ప్రజలను దేవుడే కాపాడాలి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ అంగీకరించని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. "ఈ రాత్రికే ఓ నాగరికత మొత్తం అంతమైపోతుంది, మళ్లీ తిరిగి తీసుకురాలేని విధంగా అంతరించిపోతుంది" అని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. 

"అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఇరాన్‌లో 'సంపూర్ణ పాలన మార్పు' జరిగి, వివేకవంతులైన, కొత్త ఆలోచనాపరులు అధికారంలోకి వస్తే విప్లవాత్మకమైన అద్భుతాలు కూడా జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. "ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?" అని ప్రశ్నించారు.

ప్రపంచ సుదీర్ఘ, సంక్లిష్ట చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటని ట్రంప్ అభివర్ణించారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మరణాలకు ఈ రాత్రితో ముగింపు పడుతుందని ఆయన పేర్కొన్నారు. "గొప్ప ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించాలి" అంటూ తన పోస్ట్‌ను ముగించారు. ట్రంప్ చేసిన ఈ తీవ్రమైన హెచ్చరిక వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Donald Trump
Iran
US Iran relations
Trump Iran warning
Iran nuclear deal
Truth Social
Iran regime change
Middle East politics

More Telugu News