ప్రశ్నిస్తే దాడులా?: వైసీపీ వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి యత్నాన్ని ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. జగన్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులకు దిగడం ఆయన రాక్షస ప్రవృత్తికి నిదర్శనమని మండిపడ్డారు.


రాజధాని విషయంలో జగన్ వైఖరిని మీడియా ప్రశ్నిస్తే, రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రులు స్వయంగా దాడులకు దిగడం దుర్మార్గమని మంత్రి అభివర్ణించారు. వైసీపీకి ఉన్న 'రాక్షస సంస్కృతి'కి ఈ దాడి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. సొంత మీడియా ద్వారా ఇతరులపై ఎలాంటి ఆరోపణలైనా చేస్తూ... తమ తప్పులను ఎత్తిచూపిన వారిపై భౌతిక దాడులకు దిగడం ఏమిటని ఆయన నిలదీశారు.


ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 వంటి అనేక మీడియా సంస్థలను రకరకాలుగా వేధించారని మంత్రి ఆరోపించారు. గతంలో 'జీవో 2430' తీసుకువచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదని మూర్ఖంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏకంగా కార్యాలయాలపై దాడులు చేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ మూర్ఖత్వాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, తప్పు చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని హెచ్చరించారు.

Kollu Ravindra
YSRCP
ABN Andhra Jyothi
Andhra Pradesh
Jagan Mohan Reddy
Media Attack
Political Violence
AP Politics
Excise Minister
Attacks on Media

More Telugu News