భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది!

Indian Army Receives Kamikaze Drones for Enhanced Border Security
షార్ట్స్‌లో చూడండి

భారత సైన్యం తన ఆయుధ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకుంటోంది. తాజాగా, శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా 'ఆత్మాహుతి డ్రోన్ల' (కమికాజే)ను తన అమ్ములపొదిలో చేర్చుకుంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో కీలక పాత్ర పోషించే ఈ డ్రోన్లను స్వదేశీ సంస్థ కేవలం రెండు నెలల వ్యవధిలోనే సైన్యానికి అందజేయడం విశేషం.


గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘ఇన్‌సైడ్‌ ఎఫ్‌పీవీ’ అనే సంస్థ సుమారు రూ. 10 కోట్ల ఒప్పందంలో భాగంగా వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌కు అప్పగించింది. సరిహద్దుల్లో మారుతున్న భద్రతా సమీకరణాల దృష్ట్యా, ప్రాణనష్టం లేకుండా శత్రువులను తుదముట్టించేందుకు సైన్యం వీటిని అత్యవసరంగా సమకూర్చుకుంది.


ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత గైడెన్స్‌తో లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తాయి. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై ఇవి దాడులు చేయగలవు. గరిష్ఠంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతూ శత్రువుల కంట పడకుండా చొచ్చుకెళతాయి. ప్రతి డ్రోన్ సుమారు 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లి, లక్ష్యాన్ని తాకిన వెంటనే పేలిపోతుంది. అందుకే వీటిని ఆత్మాహుతి డ్రోన్లు అంటారు.


జీపీఎస్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా ఇవి పనిచేస్తాయి. మైనస్ 35 డిగ్రీల గడ్డకట్టే చలిలో కూడా ఇవి సమర్థవంతంగా దాడులు చేయగలవు. సాధారణ సైనికులు వెళ్లలేని కఠినమైన కొండ ప్రాంతాలు, అడవుల్లోకి చొచ్చుకెళ్లి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి దిట్ట. భారత సరిహద్దుల రక్షణలో ఈ డ్రోన్లు ఒక 'గేమ్ చేంజర్'గా మారుతాయని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రవాద మూకలను ఏరిపారేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

Go Back to Shorts
Indian Army
Kamikaze drones
suicide drones
Inside FPV
drones for Indian army
AI drones
defence technology
military drones
Indian defence
border security

More Telugu News