ఏప్రిల్ 6వ తేదీ ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం.. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా రాష్ట్రాన్ని నడిపిద్దాం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదం తెలపడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ భావోద్వేగంతో కూడిన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.


పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది, భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, గౌరవ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని ఆయన స్పష్టం చేశారు.


ఈ చారిత్రక నిర్ణయం సాధ్యమవడానికి సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తమ భూములను త్యాగం చేసిన రైతులకు, పట్టుదలతో పోరాడిన ప్రజలకు చెందుతుందని కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్ల తర్వాత అధికారికంగా రాజధాని గుర్తింపు లభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

గతంలో ఎదురైన అడ్డంకులు, అనిశ్చితిని విస్మరించి, అందరం కలిసి ప్రజల రాజధాని అమరావతిని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. భావి తరాల కోసం బలమైన పునాది వేసి, 'స్వర్ణాంధ్ర 2047' విజన్ దిశగా రాష్ట్రాన్ని నడిపిద్దామని అన్నారు.

ఈ అధికారిక ప్రకటనతో అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకోనుందని, ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Pawan Kalyan
Andhra Pradesh
Amaravati
AP Capital
Droupadi Murmu
Chandrababu Naidu
Swarnandhra 2047
AP Politics

More Telugu News