Andhra Pradesh Rains: ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క సోమవారమే ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు మృత్యువాత పడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం అలముకుంది.

ప్రకాశం జిల్లాలో నిన్న పిడుగుపాటు ఐదు కుటుంబాల్లో చీకట్లు నింపింది. దర్శి మండలం చామంతపూడిలో ఆవుల మల్లికార్జున్ (22), ముండ్లమూరు మండలం పసుపుగల్లులో రావులపల్లి శివరామకృష్ణ పిడుగుపాటుకు గురై మరణించారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువులోని ఓ మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడి కన్నయ్య అనే యువకుడు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే మండలంలోని యండ్రపల్లిలో నాగయ్య, కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద దుర్గేశ్ అనే మరో వ్యక్తి కూడా పిడుగుపాటుకు బలయ్యారు. మరోవైపు, విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పనిచేస్తున్న ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతు పిడుగు తాకడంతో అక్కడికక్కడే మరణించారు.

అంతకుముందు ఆదివారం కూడా రాష్ట్రంలో మూడు మరణాలు సంభవించాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పొలం పనులకు వెళ్లిన తల్లి మడియ కృష్ణవేణి (35), కుమార్తె మడియ యోగేశ్వరి (15) పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో గీత కార్మికుడు వి. కామరాజ్ (35) కూడా పిడుగుపాటుతో మరణించారు. వరుస ఘటనలతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
 

Andhra Pradesh Rains
Lightning strikes
AP Weather
Prakasam district
Vizianagaram district
Srikakulam district
Tirupati district
Rain deaths

More Telugu News