Iran: అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం!

వారం రోజుల్లో ముగిసిపోతుందని భావించిన ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి అంచనాలను తలకిందులు చేస్తోంది. యుద్ధం మొదలై 37 రోజులు గడుస్తున్నా ఇరాన్ గట్టి ప్రతిఘటన చూపిస్తుండటంతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటివరకు అమెరికాకు చెందిన 40 వైమానిక సంపత్తి ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దం పడుతోంది. "ఇరాన్‌కు రాడార్లు, విమాన విధ్వంసక వ్యవస్థలు లేవు, మా విమానాలు సులువుగా లక్ష్యాలను ఛేదిస్తున్నాయి" అని ఏప్రిల్ 1న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అమెరికా కోల్పోయిన వాటిలో 4 ఎఫ్-15ఈ 'స్ట్రైక్ ఈగిల్' ఫైటర్ జెట్లు, 17 ఎంక్యూ-9 'రీపర్' డ్రోన్లు, 2 ఏ-10 'వార్తగ్' యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 8 కేసీ-135 ఇంధన ట్యాంకర్లు, 2 ఈ-3 ఎర్లీ వార్నింగ్ విమానాలు, 2 సీ-130 రవాణా విమానాలు దెబ్బతిని నిలిచిపోయాయి. మార్చి 19న జరిగిన ఒక దాడిలో, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎఫ్-35 'లైట్నింగ్ II' ఫైటర్ జెట్ దెబ్బతినడం ఇదే తొలిసారి.

ముఖ్యంగా, అమెరికా డ్రోన్ల దళానికి వెన్నెముక లాంటి 17 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోవడం వ్యూహాత్మకంగా పెద్ద నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఘాతో పాటు క్షిపణులను ప్రయోగించగల ఈ డ్రోన్లను ఇంత భారీ సంఖ్యలో కోల్పోవడంతో, మెరుగైన రక్షణ వ్యవస్థలున్న కొత్త డ్రోన్ల అభివృద్ధిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు, ఈ యుద్ధంలో ఇరాన్ కూడా సుమారు 40 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో ఎక్కువ భాగం పాత చైనా నిర్మిత జే-7 ఫైటర్లే ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే, ఒక్క ఫైటర్ జెట్‌ను కూడా కోల్పోనప్పటికీ, 18 మానవరహిత విమానాలను (యూఏవీలు) నష్టపోయింది.

Iran
Iran US conflict
US military losses
MQ-9 Reaper drone
F-15E Strike Eagle
Donald Trump
Israel
Military analysis
Open source intelligence
J-7 fighter

More Telugu News