Kannababu: జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు
వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' కాన్సెప్ట్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబులో వణుకు మొదలైందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చనే జగన్ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు.
అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం... మరోవైపు రాష్ట్రంలో జీతాలకు కూడా డబ్బులు లేవని ఆర్థిక మంత్రి ద్వారా చెప్పించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిపై చంద్రబాబు చేస్తున్న ఖర్చు కేవలం అవినీతి కోసమేనని, జగన్ ప్రతిపాదన ఆ అవినీతిపై ఎక్కుపెట్టిన 'గన్'లా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని 'కమ్మరావతి' అని సంబోధించినా కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణ తన రాతల ద్వారా జగన్‌పై విషం చిమ్ముతున్నారని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయమే వారిని ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పురిగొల్పుతోందని కన్నబాబు వ్యాఖ్యానించారు.