Eluru District: ఏలూరు జిల్లాలో వర్షం, ఈదురుగాలుల బీభత్సం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గత మూడు రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించినా, రైతులకు మాత్రం కన్నీళ్లను మిగిల్చింది. చేతికి అందివచ్చిన పంటలు నేలపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి, బలమైన ఈదురు గాలులకు జనజీవనం స్తంభించింది. జంగారెడ్డిగూడెం సమీపంలోని వేగవరం ప్రధాన రహదారిపై ఓ భారీ వృక్షం విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలివాన ధాటికి మామిడి, జీడి తోటల్లో కాయలు పెద్ద ఎత్తున నేలరాలాయి. మరో నెల రోజుల్లో కోత కోసి మార్కెట్‌కు తరలించాల్సిన మామిడి పంట కళ్ల ముందే దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

మామిడితో పాటు కోతకు సిద్ధంగా ఉన్న వరి, అరటి, జీడిమామిడి వంటి ఇతర పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయని రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి, కష్టపడి పండించిన పంట ఇలా అకాల వర్షానికి నాశనం కావడం తమను ఆర్థికంగా కుంగదీసిందని ఆవేదన చెందుతున్నారు.

జిల్లా అధికారులు పంట నష్టంపై అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాత రైతులకు నష్టపరిహారం అందే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది.


Eluru District
Jangareddygudem
Rain
Storm
Crop Damage
Mango Crop
Paddy Crop
West Godavari District
Weather Forecast

More Telugu News