Saudi Arabia: క్రూడాయిల్ ధరలను భారీగా పెంచిన సౌదీ అరేబియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా క్రూడాయిల్ ధరలను పెంచింది. మే నెలకు గాను బెంచ్ మార్క్ ధర కంటే 19.50 డాలర్ల అధిక ధరకు ఆసియా రిఫైనరీలకు విక్రయిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీనితో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.

పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న సౌదీ అరేబియా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉండటంతో క్రూడ్ ధరలను పెంచింది. ఆసియా కొనుగోలుదారులకు సౌదీ ఆరామ్‌కో అధిక ధరకు విక్రయిస్తోందని బ్లూమ్‌బర్గ్ వార్తా కథనం పేర్కొంది.

మే నెలలో చమురు ఉత్పత్తి కోటాను రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర పెంచడానికి చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్-ప్లస్ దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఒపెక్ కీలక సభ్య దేశాలు చమురు ఉత్పత్తిని పెంచే పరిస్థితుల్లో లేవు. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Saudi Arabia
Crude Oil
Oil Prices
OPEC
West Asia tensions
Iran
Asia Refineries
Oil Exports

More Telugu News